LSG vs CSK: మాస్ హిట్టింగ్ తో వింటేజ్ ధోని.. వరుస ఓటములకు చెక్ పెట్టిన చెన్నై.. 7 d ago

IPL 2025 లో భాగంగా 30వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో (LSG) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ వరుస ఓటములకు చెక్ పెట్టేసింది. అద్భుతంగా ఆడి చెన్నై.. లక్నోపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక సమయంలో ధనాధన్ ధోని..మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. శరవేగంగా కీలకమైన పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెద్ద తేడా ఎం లేకపోయినా..జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచి జోష్ తో బరిలోకి దిగిన లక్నో ఓపెనర్లు పేలవ ప్రదర్శన కనపరిచారు. ఐడెన్ మార్క్రామ్ (6), నికోలస్ పూరన్ (8), మార్ష్ (30).. ముగ్గురు కీలక బ్యాట్స్మెన్లు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని.. రిషభ్ పంత్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 49 బంతుల్లో 63 పరుగులు చేసి.. జట్టుకు చెప్పుకోతగ్గ స్కోరును అందించాడు. చివరిలో ఆయుష్ బడోని (22).. అబ్దుల్ సమద్ (20) రాణించడంతో..నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్.. 7 వికెట్ల నష్టానికి 166 రన్స్ స్కోరు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మతీశ పథిరన 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు షేక్ రషీద్ (27).. రచిన్ రవీంద్ర (37) విజృంభించారు. వీరిద్దరి ధాటికి పవర్ ప్లే లోనే కావాల్సిన స్కోర్ వచ్చేసింది. ఇక మ్యాచ్ వన్-సైడ్ అవుతున్నదనుకున్న సమయంలో ఓపెనర్లు ఇద్దరు ఔట్ అయ్యారు. ఇక ఇదే సమయమని లక్నో బౌలర్లు చెలరేగిపోయారు. వరుస పెట్టి వికెట్లు పడకొట్టారు. రాహుల్ త్రిపాఠి (9).. జడేజా (7).. విజయ్ శంకర్ (9) సింగిల్ డిజిట్ కే పెవిలియన్‌కు చేరారు.
జట్టు గెలవడానికి 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైన సమయంలో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. కేవలం 11 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 26* పరుగులు చేసి..సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ధోని కి సపోర్ట్ గా దూబే (43*) కూడా మెరుగైన పరుగులు చేసాడు. ధోని సిక్స్ కొట్టి ఈ విజయాన్ని ఫ్యాన్స్‌కు మరపురాని గిఫ్ట్ అందించాడు. ఆఖర్లో విన్నింగ్ నాక్ ఆడిన కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ టోర్నమెంట్లో చెన్నై తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడు విజయాలు సాధించిన లక్నో.. చెన్నై చేతిలో ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.
టోర్నీలో భాగంగా ఈరోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లక్నోలోని ఏకనా స్టేడియంలో సాయంత్రం 7:30కి ప్రారంభమవుతుంది.